Jammu And Kashmir: ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
- రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా ఆదేశించాలని పిటిషన్
- పునర్విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆరోపణ
- ఇంకా గృహ నిర్బంధంలోనే మాజీ ముఖ్యమంత్రులు
ఆర్టికల్ 370 రద్దుపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, జమ్ముకశ్మీర్ పునర్విభజన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఇదివరకే ఓ పిటిషన్ దాఖలైంది. అయితే, దానిని విచారించేందుకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. దీంతో తాజా పిటిషన్‌పై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్‌లో ఆంక్షలు సడలించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రులు అయిన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు నాయకులను మాత్రం ఇంకా గృహ నిర్బంధంలోనే ఉంచింది.