Gurajala: వైసీపీ పాలనలో ప్రజలు ఊళ్లు వదిలి పారిపోతున్నారు: టీడీపీ నేత కోడెల
- వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి
- పోలీసుల దగ్గరకు వెళితే న్యాయం జరగట్లేదు
- ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే పోలీసులూ నడుస్తున్నారు
దాదాపు అరవై రోజుల్లో వైసీపీ పాలన కలుషితంగా మారిందని మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ మండిపడ్డారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుస్తున్నారని, వైసీపీ పాలనలో ప్రజలు ఊళ్లు వదిలి పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో కోడెల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సేవ్ పల్నాడు’, ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో తొలుత గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియాగా ఉన్న పల్నాడులో టీడీపీ పాలనలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చామని గుర్తుచేశారు. కానీ, వైసీపీ పాలనలో రాష్ట్రంలో వాతావరణం కలుషితంగా మారిందని విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలు, కేసులు బనాయించడం, అమాయకులను వేధించడం, శిలాఫలకాలు పగలగొట్టడం, పోలీసుల దగ్గరకు వెళితే న్యాయం జరగకపోవడం వంటి వన్నీ వైసీపీ పాలనలో చూస్తున్నామని ఆరోపించారు.
వైసీపీ దాడుల కారణంగా గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, తాడికొండ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆరోపించారు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని అన్నారు.