srisailam: శ్రీశైలం జలాశయం మరో ఐదు గేట్లు ఎత్తి నీరు విడుదల.. సాగర్ కు 2.43 లక్షల క్యూసెక్కులు
- నిన్న తొలుత నాలుగు, రాత్రికి మరోగేట్ ఎత్తిన అధికారులు
- వరద ప్రవాహం మరింత పెరగడంతో తాజా నిర్ణయం
- ప్రస్తుతం 4.04లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయంలో మరో ఐదు గేట్లను అధికారులు ఎత్తి నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు పోటెత్తుతుండటంతో అధికారులు మొత్తం 12 గేట్లకు గానూ 10 గేట్లను ఎత్తేశారు. జలాశయం దాదాపు నిండుకుండలా మారడంతో నిన్న సాయంత్రం ఏపీ మంత్రి అనిల్ కుమార్ పూజచేసి నాలుగుగేట్లు ఎత్తిన విషయం తెలిసిందే.
రాత్రికి వరద ప్రవాహం మరింత పెరగడంతో రాత్రికి మరోగేట్ ఎత్తారు. తాజా నిర్ణయం ద్వారా మొత్తం 2,43,171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 4.04లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీలకు నీటి నిల్వ ఉంది.
మరోవైపు నాగార్జున సాగర్ జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 1.02లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6,051 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520.90 అడుగులు నమోదైంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలకుగాను ప్రస్తుతం 150.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది.