Pakistan: రగిలిపోతున్న పాకిస్థాన్... పీవోకేలో డజనుకు పైగా టెర్రరిస్టు క్యాంపుల ఏర్పాటు
- సరిహద్దుల్లో 150కి పైగా టెర్రరిస్టులు
- వీరిలో మౌలానా మసూద్ సోదరుడు కూడా
- కశ్మీర్ లోకి పంపేందుకు యత్నిస్తున్న పాక్ సైన్యం
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో భారత్ పై పాకిస్థాన్ రగిలిపోతోంది. ఉగ్రదాడుల ద్వారా భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కుట్రలకు తెరతీసింది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో డజనుకు పైగా టెర్రరిస్టు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుల్లో ఉన్న టెర్రరిస్టులకు పాక్ సైన్యం అండగా ఉంది. అదను చూసి వీరిని కశ్మీర్ లోకి పంపేందుకు యత్నిస్తోంది.
రెండు రోజుల క్రితం పాక్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ లో పుల్వామా తరహా భారీ ఉగ్ర దాడులు జరిగితే తాము బాధ్యులం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టుగానే ఉన్నాయి. సరిహద్దుల్లో 150కి పైగా ఉగ్రవాదులు మకాం వేసినట్టు భారత్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. వీరిలో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ సోదరుడు ఇబ్రహీం అత్తర్ కూడా ఉన్నట్టు తెలిపింది.