Kolkata: కోల్ కతాలో ఇండియాలో తొలి అండర్ వాటర్ మెట్రో మార్గం... వీడియో ఇదిగో!
- కోల్ కతాలో ప్రారంభోత్సవానికి సిద్ధం
- 30 మీటర్ల లోతున 520 మీటర్ల సొరంగం
- జర్మనీ నుంచి తెప్పించిన యంత్రాలతో నిర్మాణం
ఇండియాలో తొలి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ కోల్ కతాలో త్వరలో ప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, కోల్ కతా హుగ్లీ నది కింద తొలి అండర్ వాటర్ రైలు నడుస్తుందని తెలిపారు. అద్భుతమైన ఇంజనీరింగ్ కు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణని, ఇండియాలో రైల్వేల పురోగతికి ఇది చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఈ రైలు సేవలతో నగర ప్రజలు మరింత సౌకర్యవంతంగా, మరింత వేగంగా తమ గమ్యానికి చేరుతారని, ఇది దేశం గర్వపడే విషయమని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ రైల్వే స్టేషన్ కోల్ కతా మెట్రో లైన్-2 కిందకు వస్తుంది. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్ ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్ తో కలుపుతూ 5 కిలోమీటర్ల మేరకు నిర్మించిన ట్రాక్ లో భాగంగా, 30మీటర్ల లోతులో 520 మీటర్ల పొడవైన రెండు సొరంగాలు ఉంటాయి. జర్మనీ నుంచి తెప్పించిన రచ్నా, ప్రేర్నా అనే టన్నెల్ బోరింగ్ యంత్రాలు ఈ సొరంగాన్ని నిర్మించాయి. లోపలికి నీరు లీక్ కాకుండా ఉండేందుకు నాలుగంచెల రక్షణ ఏర్పాట్లను చేశారు.