Kerala: భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం... సీఎం పినరయి విజయన్ సమీక్ష
- విపత్తు నిర్వహణ విభాగ అధికారులతో సమావేశం
- అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
- కేరళ వాసుల్లో ఆందోళన
వరుణుడి ప్రతాపంతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రంలో ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొచ్చితో పాటు వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.
రానున్న రెండురోజులలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్న సమాచారంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ విపత్తు నిర్వహణ విభాగ అధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో నిన్నటి వరకు 20 మంది మృతి చెందారు. 13 వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితుల కోసం ప్రభుత్వం 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత ఏడాది ఆగస్టులోనూ ఇదే తరహా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దీంతో అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకుని కేరళ వాసులు ఆందోళన చెందుతున్నారు.