Srisailam: నిండిపోయిన శ్రీశైలం రిజర్వాయర్... నేడే గేట్ల ఎత్తివేత!
- సాగర్ ఆయకట్టు రైతాంగానికి శుభవార్త
- నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద
- గేట్లను ఎత్తనున్న ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నాగార్జున సాగర్ ఆయకట్టులోని రైతాంగానికి శుభవార్త. ఎగువ నుంచి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు నేడు తెరచుకోనున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో, నేటి సాయంత్రం 5 గంటలకు గేట్లను ఎత్తి, సాగర్ కు నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై క్రస్ట్ గేట్లను తెరవనున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, మరో నాలుగు అడుగుల మేరకు వరద నీరు చేరితే డ్యామ్ పూర్తిగా నిండనుంది. గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వరద రావడంతో, పది రోజుల వ్యవధిలోనే డ్యామ్ నిండిపోయిందని అధికారులు అంటున్నారు.