Jammu And Kashmir: కశ్మీర్, లడఖ్ లలో కొత్త శకం ప్రారంభమైంది.. అభినందనలు తెలియజేస్తున్నా: ప్రధాని మోదీ
- ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం
- ఎందరో మహనీయుల స్వప్నం సాకారమైంది
- ‘370’ని పాకిస్థాన్ ఆయుధంలా వాడుకుంది
జమ్ముకశ్మీర్ ను పునర్విభజన చేయడం, ఆర్టికల్ 370, 35-A రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ నుంచి మోదీ మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ఎందరో మహనీయుల స్వప్నం సాకారమైందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందని, ఒకటే భారత్, ఒకటే రాజ్యాంగం అనే స్వప్నం ఫలించిందని చెప్పారు. జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రజలకు తన అభినందనలు తెలియజేస్తున్నానని, అక్కడ కొత్త శకం ప్రారంభమైందని అన్నారు.
ఆర్టికల్ 370, 35-A వల్ల కశ్మీర్ లో ఉగ్రవాదం పెరడగం తప్ప, అక్కడి ప్రజలకు ఏమీ జరగలేదని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆర్టికల్ 370, 35-A వల్ల కశ్మీర్ లో కుటుంబ వాదం, ఉగ్రవాదం తప్ప సాధించిందేమీ లేదని, ‘370’ని పాకిస్థాన్ ఆయుధంలా వాడుకుందని అన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా జమ్ముకశ్మీర్ వెనుకబడిందని, కశ్మీర్ ను రక్షించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పటి వరకూ ప్రజలకు ఉపయోగపడే ఏ చట్టమూ అక్కడ అమలు కాలేదని, అక్కడి పిల్లలకు విద్య అందలేదని మోదీ అన్నారు.