Sravana Masam: శ్రావణ మాసం.. పూల ధరలకు రెక్కలు!
- హైదరాబాద్ లోని పూల మార్కెట్లలో రద్దీ
- కిలో గులాబీల ధర రూ.250 నుంచి రూ.300
- బంతిపూల ధర రూ.100, చేమంతులు రూ.350
శ్రావణ మాసం పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక, శ్రావణ శుక్రవారం రోజున ముత్తయిదువలు చేసే పూజలు, నోచే నోములకు కొదవలేదు. రేపు శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మీ వ్రతం చేసుకునే ముత్తయిదువలు బిజీబిజీగా ఉన్నారు. రేపటి వ్రతానికి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్ లోని పలు పూల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పూల ధరలు ఓ రేంజ్ లో ఉన్నట్టు సమాచారం. కిలో గులాబీల ధర రూ.250 నుంచి రూ.300 పలుకుతుండగా, బంతిపూల ధర రూ.100, చేమంతులు రూ.350 ఉండగా, జాజిపూల ధర పావు కిలోనే మూడు వందలు పలుకుతోందని, చిన్న మామిడాకులు కొమ్మ ధర ఇరవై ఐదు రూపాయలు చెబుతున్నారని కొనుగోలు నిమిత్తం వచ్చిన మహిళలు చెబుతున్నారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది పూల ధరలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. పూల ధరలు పెరగడంపై ఆ వ్యాపారులు మాట్లాడుతూ, పూలు బయటి రాష్ట్రాల నుంచి తీసుకువస్తామని, పండగల సీజన్ మొదలైంది కనుక, ధరలు బాగానే ఉంటాయని అన్నారు.