James Harrison: జేమ్స్ హ్యారిసన్.. 24 లక్షల మంది శిశువుల్ని తన రక్తంతో కాపాడాడు!
- జేమ్స్ రక్తంలో అసాధారణ వైద్య గుణాలున్నట్టు గుర్తింపు
- అతని రక్తంలోని ప్లాస్మా నుంచి ఇంజెక్షన్ తయారీ
- రెండు వారాలకు ఓసారి రక్తదానం
ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హ్యారిసన్ ఓ అరుదైన వ్యక్తి. ఆస్ట్రేలియా వైద్యరంగంలో ఆయన్నో అద్భుతంలా చూస్తారు. అందుకు కారణం ఆయన రక్తమే. ఇతరుల్లా కాకుండా జేమ్స్ రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యేక వైద్య గుణాలున్నాయి. తల్లి గర్భంలో ఉన్న శిశువులు చాలా సందర్భాల్లో రక్తకణాలను దెబ్బతీసే ప్రాణాంతక వ్యాధులకు గురవుతుంటారు. అలాంటి శిశువులకు వ్యాధి నిరోధక శక్తి అందించడమొక్కటే మార్గం. అందుకు జేమ్స్ హ్యారిసన్ రక్తం అనువైన సాధనంగా గుర్తించారు.
ఆయన రక్తంలోని ప్లాస్మాకు అత్యంత అరుదైన రీతిలో అపారమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్టు తెలుసుకున్నారు. దాంతో, ఆ ఆస్ట్రేలియా జాతీయుడి రక్తంలోని ప్లాస్మా నుంచి శిశువులను కాపాడే వ్యాధి నిరోధక ఇంజెక్షన్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు జేమ్స్ రక్తం నుంచి తయారు చేసిన ఇంజెక్షన్లతో దాదాపు 24 లక్షల మంది శిశువులను ప్రాణహాని నుంచి రక్షించారు. జేమ్స్ రక్తంలోని ప్లాస్మా ద్వారా రూపొందించే యాంటీ-డి ఇంజెక్షన్ కు ఆస్ట్రేలియాలో విపరీతమైన డిమాండ్ ఉంది.
ఈ ప్రక్రియలో భాగంగా జేమ్స్ రక్తం నుంచి ప్లాస్మాను సేకరించిన అనంతరం అతడికి తిరిగి ఎర్ర రక్తకణాలను ఎక్కిస్తుంటారు. తద్వారా ఆయన త్వరగా మళ్లీ రక్తం పట్టి రక్తదానానికి సంసిద్ధమయ్యే వీలుంటుంది. హ్యారిసన్ వయసు 60 ఏళ్లు కాగా, ప్రతి రెండు వారాలకు ఓసారి రక్తదానం చేస్తూ లక్షలాది శిశువులకు ప్రాణదాతగా మారారు.