Gulam Nabi Azad: శ్రీనగర్ ఎయిర్ పోర్టులో అజాద్ ను అడ్డుకున్న అధికారులు.. మరో విమానంలో ఢిల్లీకి పంపిన వైనం!

  • ఆర్టికల్ 370 రద్దుతో ఉద్రిక్తంగా ఉన్న కశ్మీర్
  • గృహ నిర్బంధంలో మాజీ ముఖ్యమంత్రులు
  • 400 మంది జైళ్లకు తరలింపు

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ నేడు శ్రీనగర్ లో అడుగుపెట్టారు. అయితే, ఆయనను విమానాశ్రయంలోనే అడ్డుకున్న భద్రతాధికారులు... మధ్యాహ్నం 3.30 గంటలకు మరో విమానంలో ఢిల్లీకి వెనక్కి పంపించేశారు.

షెడ్యూల్ ప్రకారం శ్రీనగర్ లో ఓ కార్యక్రమానికి అజాద్ హాజరుకావాల్సి ఉంది. . ఆ తర్వాత తన నివాసానికి ఆయన చేరుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన ఓ నేత (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) మాట్లాడుతూ, అజాద్ ఎయిర్ పోర్ట్ వెలుపలికి రావడానికి అధికారులు అంగీకరించలేదని చెప్పారు.  

మరోవైపు, జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 400 మందిని జైల్లో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, అజాద్ ను విమానాశ్రయం నుంచే ఢిల్లీకి వెనక్కి తిరిగి పంపేశారు.

ఈ ఉదయం ఢిల్లీలో అజాద్ మాట్లాడుతూ, 'జమ్ముకశ్మీర్ ప్రజలు బాధలో ఉన్నారు. ఈ సమయంలో వారితో ఉండేందుకు నేను అక్కడకు వెళ్తున్నా. మొత్తం 22 జిల్లాల్లో కర్ఫ్యూ ఉంది... ఇలాంటి సందర్భం బహుశా ఇదే మొదటిదై ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్టు విన్నారా?' అని అన్నారు.

శ్రీనగర్ వీధుల్లో కొందరు స్థానికులతో కలసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భోజనం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా కశ్మీర్ ప్రశాంతంగా ఉందనే సంకేతాలను ఆయన బయట ప్రపంచానికి అందించారు. దీనిపై అజాద్ మాట్లాడుతూ... డబ్బు ఇవ్వడం ద్వారా ఇలాంటి పనులు చేయవచ్చని ఎద్దేవా చేశారు.  

  • Loading...

More Telugu News