america: ఆకలి ఎఫెక్ట్.. 911కు ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇచ్చిన అమెరికా పిల్లాడు.. పోలీసులు ఏం చేశారంటే..!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • పిజ్జా కోసం పోలీసులకు ఫోన్ కొట్టిన ఐదేళ్ల బుడతడు
  • హుటాహుటిన ఇంటికొచ్చేసిన పోలీసులు

బాగా ఆకలేస్తే ఎవరైనా ఇంట్లో భోజనం తింటారు. అదీ నచ్చకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెడతారు. కానీ అమెరికాకు చెందిన ఓ చిచ్చర పిడుగు మాత్రం ఏకంగా పోలీసులకు ఫోన్ చేశాడు. తనకు బాగా ఆకలేస్తోందనీ, ఓ పిజ్జా పట్టుకురావాలని ఆర్డర్ వేశాడు.

మాన్యుయెల్ బెషరా(5) తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి ఫ్లోరిడాలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు బయటకు వెళ్లాక, సోదరి ఇంట్లోనే ఉంది. ఈ సందర్భంగా ఫోన్ తీసుకున్న బెషరా 911కు కాల్ చేశాడు. తనకు బాగా ఆకలిగా ఉందనీ, తాను పిజ్జా ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఏదైనా దుర్ఘటన జరిగి పిల్లాడు ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడేమోనని అనుమానించిన పోలీసులు ఓ యూనిట్ ను అక్కడకు పంపారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్ చేసింది ఐదేళ్ల పిల్లాడు అని తెలుసుకుని అవాక్కయ్యారు. అనుకోకుండా పోలీసులు తమ ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో బెషరా సోదరి షాక్ కు గురైంది. తనకు తెలియకుండానే తమ్ముడు 911కు కాల్ చేశాడనీ, తమను క్షమించాలని కోరింది. దీంతో పోలీసులు.. 911 నంబర్ కు ఎప్పుడు డయల్ చేయాలి. ఎప్పుడు చేయకూడదు అనే విషయాన్ని బెషరాకు వివరించారు. అనంతరం ఓ కింగ్ సైజ్ పిజ్జాను మాన్యుయెల్ బెషరాకు అందించారు. దీంతో పిల్లాడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News