Srisailam: శ్రీశైలం నుంచి పెరిగిన ఔట్ ఫ్లో... గేట్లు ఎత్తేందుకు మరింత సమయం!
- ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద
- పూర్తి స్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ కేంద్రాలు
- నాగార్జున సాగర్ కు 50 వేల క్యూసెక్కుల వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీ వరద వస్తున్నప్పటికీ, ముందుగా అనుకున్న ప్రకారం, నేడో, రేపో శ్రీశైలం గేట్లను వదిలే అవకాశం కనిపించడం లేదు. వరద మరిన్ని రోజుల పాటు కొనసాగవచ్చన్న సమాచారంతో ఇప్పటికే దాదాపు 80 వేల క్యూసెక్కులను శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నారు. ఇదే సమయంలో నాగార్జున సాగర్ కు 50 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది.
ఇక శ్రీశైలానికి ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్కులను దాటినప్పటికీ, దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు బయటకు వెళుతూ ఉండటంతో నికరంగా 2 లక్షల క్యూసెక్కులే రిజర్వాయర్ లో చేరుతోంది. 3.51 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 83,339 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 163 టీఎంసీల నీరు చేరిందని తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో గేట్లను ఎత్తివేసేందుకు మరింత సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు.
ఇదిలావుండగా, తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వ 49 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు పైగా ఉందని అధికారులు తెలియజేశారు.