Telangana: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత కేసు.. హైకోర్టు తీర్పు రిజర్వ్
- పురాతన కట్టడాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: పిటిషనర్ తరపు న్యాయవాది
- అధునాతన అసెంబ్లీ భవనం నిర్మించాలని ప్రభుత్వం భావించింది: అడ్వకేట్ జనరల్
- ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం
తెలంగాణలో కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది, ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తమ వాదనలను న్యాయస్థానానికి విన్నవించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.
రెగ్యులేషన్ 13 రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని, చారిత్రక కట్టడాల జాబితాను రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీవో 183 చట్టవిరుద్ధమని, ఎర్రమంజిల్ భవనాల కూల్చి వేసి కొత్త భవనం నిర్మించాలని అనుకోవడం సబబు కాదని హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినట్టవుతుందని వాదించారు.
సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన హాలును అసెంబ్లీ భవనంగా వినియోగిస్తున్నామని, అధునాతనంగా అసెంబ్లీ భవనం నిర్మించాలని ప్రభుత్వం భావించడం వల్లే కొత్త భవనం నిర్మించాలన్న నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు.