savitri: సావిత్రిగారిని ఇంటర్వ్యూ చేయాలనే కోరిక అలా నెరవేరింది: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్
- భానుమతిగారితో నాకు సాన్నిహిత్యం వుంది
- విజయనిర్మల గారు చాలా సరదా మనిషి
- సమావేశానికి సావిత్రిగారు ఒప్పుకోవడంతో సక్సెస్ అయ్యానన్న ఈశ్వర్
తెలుగు తెర చందమామగా సావిత్రికి పేరు వుంది. 'మహానటి'గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన సావిత్రి జీవితం ఆ తరువాత మసకబారింది. తాజాగా ఆమెను గురించి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. "నాకు సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేయాలని ఉండేది. అయితే వ్యక్తిగత కారణాల వలన ఆమె పత్రికా విలేకరులకు దూరంగా ఉండేవారు. అందువలన ఆమెను కలవడమే కష్టం.
అందువలన సావిత్రిలోని దర్శకురాలిని ప్రెజెంట్ చేస్తానంటే ఇంటర్వ్యూకి ఆమె ఒప్పుకోవచ్చుననిపించింది. అప్పటికే మహిళా దర్శకులుగా పేరు తెచ్చుకున్న భానుమతి .. విజయనిర్మల గార్లతో కలిపి సావిత్రిగారిని సమావేశపరిస్తే మరింత బాగుంటుందని అనిపించింది. భానుమతిగారితో నాకు గల సాన్నిహిత్యం కారణంగా, ఈ ముగ్గురినీ భరణీ స్టూడియోలో సమావేశపరచడం తేలికైంది. కాకపోతే ఈ సమావేశం ఏ గొడవకైనా దారితీస్తుందేమోనని టెన్షన్ పడ్డాను. మొత్తానికి ఎలాంటి వివాదం లేకుండా ఆ సమావేశం పూర్తికావడంతో హమ్మయ్య అనుకున్నాను. ప్రచురణ తరువాత సినిమా పాఠకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.