Vijayasanthi: కాంగ్రెస్ గొప్పతనం ఇదే: విజయశాంతి

  • ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన కొందరు నేతలు
  • దేశ భద్రతలో కాంగ్రెస్ ఎన్నడూ రాజీ పడబోదు
  • రాజకీయాలను తమ ఎంపీలు పక్కన పెట్టారన్న విజయశాంతి

ఆర్టికల్ 370 రద్దును కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించడాన్ని ఆ పార్టీ మహిళా నేత విజయశాంతి స్వాగతించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జ్యోతిరాదిత్య సింధియా, జనార్దన ద్వివేది తదితరులు బీజేపీ నిర్ణయాన్ని సమర్ధించడాన్ని ప్రస్తావించిన ఆమె, దేశ భద్రత విషయంలో రాజీ కూడదన్న కాంగ్రెస్ గొప్పతనానికి ఇదే నిదర్శనమని అన్నారు. "జమ్మూ-కశ్మీర్ విభజన బిల్లుతో పాటు ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు రాహూల్ గాంధీ కుడిభుజం, కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం, కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించడం శుభపరిణామం.


నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ- నెహ్రూ కుటుంబానికి సన్నిహితుడైన జనార్దన ద్వివేది కూడా కేంద్రం జమ్ము, కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. ఇప్పుడు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా...దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. కాంగ్రెస్ లోని మెజారిటీ కార్యకర్తలు జమ్ము- కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నారు.

వీరి అభిప్రాయలను ప్రతిబింబించే విధంగా జనార్దన ద్వివేదితో పాటూ జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు కూడా కేంద్రం జమ్ము కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించినట్లు భావిస్తున్నాను. వీరిద్దరితో పాటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు చెందిన చాలా మంది నేతలు కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించవచ్చు.

పార్టీలు వేరైనా దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలోనూ, శత్రు దేశ కుట్రలను తిప్పి కొట్టడంలోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా తమ గళాన్ని వినిపిస్తారనే విషయం సింధియా, ద్వివేది ప్రకటనల ద్వారా మరోసారి రుజువైంది. కశ్మీర్ విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు పరిష్కారం లభించాలని, అక్కడి ప్రజలు సుఖ,శాంతులతో జీవనం సాగించాలని కోరుకుంటూ...వందే మాతరం...జైహింద్" అని ఆమె అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News