Rains: భారీ వర్షాలకు ధ్వంసమైన పట్టాలు... ఏపీలో పలు రైళ్లు రద్దు!
- గత వారం రోజులుగా భారీ వర్షాలు
- పలు చోట్ల రైల్వే ట్రాక్ ల పైకి నీరు
- 9 రైళ్లను రద్దు చేశామన్న అధికారులు
గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపైకి నీరు చేరడం, ట్రాక్ దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకూ కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్నింటిని దారి మళ్లించామని వాల్తేరు డివిజన్ ప్రకటించింది.
ఏవోబీ సరిహద్దులోని డోయికళ్లు స్టేషన్ సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న కారణంగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో, 9 రైళ్లను రద్దు చేశామని, 5 దూరప్రాంత రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. సంబల్ పూర్ - కోరాపుట్ మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లు, విశాఖపట్నం - రాయపూర్ మధ్య తిరిగే రైళ్లతో పాటు సంబల్ పూర్ - రాయగఢ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశామని తెలియజేశారు. పూరీ - అహ్మదాబాద్, బెంగళూరు - హతియా ఎక్స్ ప్రెస్, ధనబాద్ - అలెప్పి, విశాఖ - నిజాముద్దీన్ సమత ఎక్స్ ప్రెస్ రైళ్ల దారిని మళ్లించామని పేర్కొన్నారు.