Jammu And Kashmir: నా ఛాతీపై కాల్చండి, నా వెనక కాదు: ఫరూక్ అబ్దుల్లా ఆగ్రహం

  • నా రాష్ట్రం మండిపోతుంటే నేను ఇంట్లో ఉంటానా?
  • మీతో మాట్లాడేందుకు నేను బలవంతంగా బయటకొచ్చా
  • నేను విశ్వసించింది ఈ భారతదేశాన్ని కాదు

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపక్క తనను నిర్బంధించి.. ఇష్టపూర్వకంగా ఇంట్లో ఉన్నారంటూ మరోపక్క అబద్ధాలు చెబుతున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. లోక్ సభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడానికి ముందు శ్రీనగర్ లో తన నివాసం వద్ద ఆయన మీడియాతో భావోద్వేగంగా మాట్లాడారు. గృహనిర్బంధం నుంచి బయటకు రాగానే న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.

‘మీతో మాట్లాడటానికి నేను బలవంతంగా బయటకు వచ్చాను. నేను గృహనిర్బంధంలో లేనని హోం మంత్రిత్వ శాఖ అబద్ధాలు చెబుతోందని చెప్పడానికే వచ్చాను. నా రాష్ట్రం మండిపోతుంటే, నా ప్రజలు జైలుకు వెళుతుంటే నేను ఇష్టపూర్వకంగా ఇంట్లో ఉంటానా? నేను విశ్వసించింది ఈ భారతదేశాన్ని కాదు. నా భారతదేశం ప్రజాస్వామికమైనది. ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరికీ లౌకిక దేశంగా ఉంటుంది. కేంద్ర నిర్ణయం అప్రజాస్వామికమైనది. వారి తుపాకీ చప్పుళ్లకు నేను భయపడను.

డెబ్బై ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రజలను గాయపర్చారు. గేట్లు తెరచుకున్న వెంటనే నా ప్రజలు బయటకు వస్తారు. పోరాటం చేస్తాం, కోర్టును ఆశ్రయిస్తాం. మేము తుపాకీ పట్టుకుని తిరిగేవాళ్లం కాదు. గ్రెనేడ్లను, రాళ్లను విసిరే వాళ్లం కాదు. మేము శాంతియుత నిర్ణయాలకు కట్టుబడి ఉండేవాళ్లం. వారు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. నా ఛాతీపై కాల్చండి, నా వెనక కాదు. అయినా ఈ దేశం కోసం నిలబడతాను. ఇక ముందు మా పోరాటం కొనసాగిస్తాం’ అని అన్నారు.

  • Loading...

More Telugu News