Jogi Nayudu: ఇండస్ట్రీలో చెప్పుడు మాటల ప్రభావం ఎక్కువ: జోగినాయుడు
- ఎప్పుడు బ్రేక్ వస్తుందో ఎవరికీ తెలియదు
- కులం ఫీలింగ్ ఎక్కువగా వుంది
- నా ప్రయత్న లోపమైతే లేదన్న జోగినాయుడు
నటుడిగా బుల్లితెరపై మంచి మార్కులు కొట్టేసిన జోగినాయుడు, వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయనను పూర్తిస్థాయిలో బిజీ చేసే సరైన పాత్ర మాత్రం ఇంకా పడలేదు. అలాంటి పాత్ర కోసమే వెయిట్ చేస్తోన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు.
"ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలా బ్రేక్ వస్తుందనేది చెప్పలేం. నా వంతుగా ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటున్నాను. టాలెంట్ వున్న వాళ్లకే ఇక్కడ అవకాశాలు ఉంటాయనడంలో నిజం లేదు. అవకాశాలు రాకపోవడానికి ఇక్కడ అనేక కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మన గురించి చెడు చెప్పేవాళ్లు ఎక్కువగా వుంటారు. అవతలవాళ్లు ఆ చెప్పుడు మాటలు విన్నప్పుడు మనకి రావలసిన అవకాశాలు పోతుంటాయి. ఒక దర్శకుడు ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఆ ఆర్టిస్ట్ ఫలానా కులమనీ .. ఫలానా పార్టీ అని చెవిలో వేసి చెడగొట్టేసేవాళ్లు చాలామంది వుంటారు. అలాంటి వాతావరణం కారణంగానే అవకాశాలు పోతుంటాయి" అని ఆవేదన వ్యక్తం చేశాడు.