Jammu And Kashmir: సంబరాలు చేసుకుంటున్న హైదరాబాద్ లోని కశ్మీరీ పండిట్స్
- ఆర్టికల్ 370 రద్దుపై హర్షం
- ఈ ఆర్టికల్ రద్దుతో మాకు పునరుజ్జీవం వచ్చింది
- మోదీ, అమిత్ షాకు కృతఙ్ఞతలు: కశ్మీరీ పండిట్స్
ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీరీ పండిట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కశ్మీర్ లో పరిస్థితుల రీత్యా ఆ ప్రాంతాన్ని వదిలి హైదరాబాద్ వచ్చేసిన కశ్మీరీ పండిట్స్ స్పందిస్తూ, ఈ ఆర్టికల్ రద్దుతో తమకు పునరుజ్జీవం వచ్చిందని అంటున్నారు. గతంలో అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల కారణంగా బంధువులను, మిత్రులను వదిలి ఇతర ప్రాంతాలకు తాము వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై హర్షం వ్యక్తం చేసిన కశ్మీరీ పండిట్స్, తమ మాతృభూమిలో అడుగు పెట్టబోతున్నామంటూ సంబరాలు చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రధాని మోదీ రద్దు చేయకపోతే, ఇక ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేరని అభిప్రాయపడ్డారు. కేవలం, కశ్మీరీ పండిట్సే కాదు, యావత్తు దేశం సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు కృతఙ్ఞతలు తెలుపుతున్నామని హైదరాబాద్ లోని కశ్మీరీ పండిట్స్ తెలిపారు.