Amit Shah: ఫరూక్ అబ్దుల్లాను ఎవరూ అరెస్ట్ చేయలేదు: లోక్ సభలో అమిత్ షా
- శ్యామ్ ప్రసాద్ ముఖర్జీపై మసూది అబద్ధాలు చెబుతున్నారు
- ముఖర్జీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు
- ఆర్టికల్ 370ని ఆయన ఎప్పుడూ సమర్థించ లేదు
జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై లోక్ సభలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని విపక్ష సభ్యులు తప్పుబట్టారు. జమ్ముకశ్మీర్ అంశపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్ర కీలక నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను అన్యాయంగా అరెస్ట్ చేసి, సభలో లేకుండా చేశారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, ఫరూక్ అబ్దుల్లాను ఎవరూ అరెస్ట్ చేయలేదని చెప్పారు.
ఇదే సమయంలో, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుడు మసూదిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎప్పుడూ స్వాగతించలేదని... ఆ ఆర్టికల్ ను రద్దు చేయాలని ఆయన ప్రాణాలు అర్పించారని చెప్పారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి మసూది అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.