Kamal Haasan: ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన కమలహాసన్... ఘాటుగా కౌంటర్ ఇచ్చిన 'పీవీపీ'
- జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
- కేంద్రానిది నిరంకుశత్వం, తిరోగమన చర్య అంటూ విమర్శించిన కమల్
- ఇదే స్పందన ఏపీ విషయంలో ఏమైందంటూ పీవీపీ ట్వీట్
ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షమని, నిరంకుశ, తిరోగమన చర్య అని విమర్శించిన కమలహాసన్ ను వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత 'పీవీపీ' (పొట్లూరి వరప్రసాద్) ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. "తిరోగమన చర్య, నిరంకుశత్వం, సంప్రదింపులు జరిపితే బాగుండేది అంటూ మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు చూశాను. కొన్నాళ్ల కిందట, సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఓ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు కూడా ప్రజల తరఫున గళం వినిపిస్తారని ఆశించాం. మీకెంతో పేరుప్రఖ్యాతులు, అదృష్టాన్ని అందించిన రాష్ట్రం అది. కానీ ఆనాడు మీరు స్పందించలేదు" అంటూ ఎంతో బాధతో ప్రశ్నించారు.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసిన సమయంలో కమలహాసన్ సహా దక్షిణాది సినీ ప్రముఖులెవ్వరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే చాలామంది పరభాషా అగ్రనటులు తెలుగు ప్రజలను తమ దేవుళ్లుగా పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలను సైతం తెలుగు చిత్రాలతో సమానంగా ఆదరించిన ఘనత తెలుగు ప్రేక్షకులది అని విమర్శకులు కూడా అంగీకరిస్తారు. పైగా, కమలహాసన్ వంటి కొందరు నటులు నేరుగా తెలుగు చిత్రాల్లో నటించినా ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకే పీవీపీ ఎంతో ఆవేదనతో కమల్ కు ట్వీట్ చేశారు.