Shahid Afridi: మేము అంతా చూసుకుంటాం.. నీవు కంగారు పడకు: అఫ్రిదీకి గౌతం గంభీర్ కౌంటర్
- ఆర్టికల్ 370 రద్దుపై మండిపడ్డ అఫ్రిది
- ఐక్యరాజ్యసమితి నిద్రపోతోందంటూ వ్యాఖ్య
- అరాచకాలన్నీ పీఓకేలోనే జరుగుతున్నాయన్న గంభీర్
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కశ్మీరీ ప్రజల హక్కులను భారత ప్రభుత్వం కాలరాస్తున్నా... ఐక్యరాజ్యసమితి నిద్రపోతోందని మండిపడ్డాడు. కశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు.
అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించాడు. మానవ హక్కుల హననం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే జరుగుతోందని అన్నాడు. మానవ హక్కుల గురించి అఫ్రిది మాట్లాడటం చాలా సంతోషకరమని... అయితే, మానవ హక్కుల హననం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందనే విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని సెటైర్ వేశాడు. అఫ్రిది కంగారు పడాల్సిన అవసరం లేదని... అన్ని విషయాలను తాము చూసుకుంటామని చెప్పాడు.