Lok Sabha: కశ్మీర్ కోసం ప్రాణమైనా ఇస్తా... పీఓకే కూడా మనదే: లోక్ సభలో అమిత్ షా ఉద్వేగం
- కశ్మీర్ ఉద్రిక్తతలకు కాంగ్రెస్ పార్టీయే కారణం
- బిల్లును ఆమోదించేందుకు సహకరించాలి
- పీఓకే నుంచి పాకిస్థాన్ వైదొలగాలన్న అమిత్ షా
కశ్మీర్ కోసం తాను ప్రాణాలైనా అర్పిస్తానని, రాష్ట్రంలోని ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం లోక్ సభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా తనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పై మండిపడుతూ, అమిత్ షా ఉద్వేగ పూరిత ప్రసంగాన్ని చేశారు. కశ్మీర్ లో ప్రజలు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురవుతుంటే, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కశ్మీర్ లో ఉద్రిక్తతలకు కారణం కాంగ్రెస్ వైఖరేనని మండిపడ్డారు.
ఇప్పటికే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సైతం బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని, లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే, ప్రజలు హర్షిస్తారని అన్నారు. ఈ బిల్లు అమలైతే కశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అమిత్ షా గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్ కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న పీఓకే సైతం భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు.