Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ అంశాన్ని పీ5 దేశాలకు వివరించిన భారత్
- జమ్ముకశ్మీర్ లో మారుతున్న పరిణామాలను గమనిస్తున్న ప్రపంచ దేశాలు
- ఆయా దేశాల రాయబారులకు వివరించిన విదేశాంగ శాఖ
- నియంత్రణ రేఖ వద్ద శాంతికి ఇరు దేశాలు కృషి చేయాలన్న అమెరికా
జమ్ముకశ్మీర్ లో శాంతిని నెలకొల్పే దిశగా భారత ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భిన్నంగా అక్కడి వారికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసే బిల్లును నిన్న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించి... రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విడగొట్టింది. జమ్ముకశ్మీర్ లో వాయువేగంగా మారుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, పీ5 (ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే) దేశాలకు జమ్ముకశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగ శాఖ వివరించింది. పార్లమెంటులో జరుగుతున్న, జరగబోతున్న పరిణామాలను ఆయా దేశాల రాయబారులకు వివరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో జమ్ముకశ్మీర్ లో సుపరిపాలన, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో, అమెరికా ప్రతినిధి స్పందిస్తూ నియంత్రణ రేఖ వద్ద శాంతి, సుస్థిరతలకు ఇరు దేశాలు కృషి చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మాట్లాడుతూ, కశ్మీర్ పై భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.