sanjay seth: సమాజ్‌వాదీ పార్టీకి మూడో దెబ్బ.. సంజయ్ సేథ్ గుడ్ బై
- నెల రోజుల్లో పార్టీని వీడిన ముగ్గురు సభ్యులు
- త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్న నేతలు
- రాజ్యసభలో పదిమందికి పరిమితమైన ఎస్పీ బలం
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సేథ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం ఆయన రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. పార్టీ కోశాధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ సేథ్ రాజీనామాతో రాజ్యసభలో ఎస్పీ బలం పది మందికి పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీకి నెల రోజుల్లో ఇది మూడో ఎదురుదెబ్బ.
జూలై 15న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ రాజీనామా చేయగా, ఈ నెల 2న సురేంద్ర నగర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నీరజ్ శేఖర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. త్వరలోనే సురేంద్ర, సంజయ్‌లు కూడా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.