Bhimavaram: భీమవరంలో గెలిచినట్టయితే డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించే వాడిని: పవన్ కల్యాణ్
- ఇక్కడ గెలిచిన వ్యక్తి ఈ సమస్యను పరిష్కరించాలి
- వంద ఎకరాల్లో కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి
- పార్టీని బలోపేతం చేయడం నా ముందున్న లక్ష్యం
భీమవరంలో దురదృష్టవశాత్తూ ఓడిపోయానని, లేకపోతే డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించే వాడినని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భీమవరంలో రెండో రోజూ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, భీమవరం నుంచి గెలిచినట్లయితే ముందుగా డంపింగ్ యార్డు సమస్యనే పరిష్కరించేవాడినని, దురదృష్టవశాత్తు ఓడిపోయానని అన్నారు. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, 100 ఎకరాల్లో కొత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని కోరారు.
భీమవరం పట్టణాన్ని మున్సిపాలిటి నుంచి కార్పొరేషన్ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ వంటి ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా కాలుష్యంతో తాగడానికి మంచినీళ్లు లేకపోవడం దురదృష్టకరమని, అలాగే, వరదలు వచ్చి పంటలు నష్టపోవడం, లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోవడం వంటి అంశాలు తనను తీవ్రంగా బాధించినట్టు చెప్పారు.
ఏ ఆశయం కోసం జనసేన పార్టీని స్థాపించానో దాని సాధన కోసం మరింత బలంగా దూసుకెళ్తామని మరోసారి స్పష్టం చేశారు. జయాపజయాలు రాజకీయ ప్రక్రియలో భాగమని, ఒకసారి దెబ్బతిన్నంత మాత్రాన వెనక్కి వెళ్లనని, పార్టీని బలోపేతం చేయడం, జనసైనికులను పార్టీకి అనుసంధానం చేయగలిగే నాయకత్వాన్ని గుర్తించడం తమ ముందున్న లక్ష్యంగా పేర్కొన్నారు.