Pakistan: ఈ కెప్టెన్ ఉంటే గెలవడం కష్టమే: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసిన కోచ్
- సర్ఫరాజ్ ను తప్పించాలని కోరిన మికీ ఆర్థర్
- వన్డేలు, టి20లకు షాదాబ్ ఖాన్, టెస్టుల్లో బాబర్ కు పగ్గాలు అప్పగించాలని సూచన
- సర్ఫరాజ్ కంటే ముందే జాగ్రత్త పడిన ఆర్థర్!
ఆటగాళ్లు కలసికట్టుగా ఉంటే కోచ్ బద్ధవిరోధిలా ఉండడమో, కోచ్ కలివిడిగా ఉంటే ఆటగాళ్లు తమలో తాము కలహించుకోవడమో పాకిస్థాన్ క్రికెట్ జట్టులోనే ఎక్కువగా కనిపిస్తుంది! పాక్ జట్టులో సఖ్యత, ఐక్యత అనేవి నీటి మూటలేనని మరోసారి నిరూపితమైంది. పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా సర్ఫరాజ్ అహ్మద్ పనికిరాడంటూ కోచ్ మికీ ఆర్థర్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి లేఖ రాశాడు. సర్ఫరాజ్ స్థానంలో వన్డేలు, టి20లకు షాదాబ్ ఖాన్ ను, టెస్టులకు బాబర్ అజామ్ ను కెప్టెన్లుగా నియమించాలంటూ సూచించాడు. మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఈ మార్పులు చేయడంతోపాటు తనకు రెండేళ్ల సమయం కూడా ఇవ్వాలని ఆర్థర్ పీసీబీని కోరాడు.
ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండడంతో కెప్టెన్, కోచ్ లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో, కెప్టెన్ కంటే ముందుగా తానే బోర్డుకు రిపోర్టు ఇవ్వడం ద్వారా ఆర్థర్ తనపై వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతోంది.