Jammu And Kashmir: ఆర్టికల్ 370 రద్దుపై ప్రత్యేకంగా స్పందించిన అంతర్జాతీయ మీడియా
- మోదీ సర్కారు సంచలనం
- జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించే ఆర్టికల్ 370 రద్దు
- రెండు ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం చారిత్రాత్మక రీతిలో తొలగించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం దరిమిలా ఢిల్లీ తరహా అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ- కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడ్డాయి. కశ్మీర్ లోయలో గత కొన్నిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి ఎన్డీయే సర్కారు నేటితో తెరదించింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా తీవ్రస్థాయిలోనే స్పందించినట్టు అర్థమవుతోంది. దీనిపై ప్రముఖ మీడియా సంస్థలు నిశిత వ్యాఖ్యలు చేశాయి.
"కశ్మీర్ ను రెండు ముక్కలు చేయడం నాటకీయ చర్య. పాకిస్థాన్ తో ఉద్రిక్తతలను ఈ చర్య మరింత పెంచవచ్చు. జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదు. ఏదేమైనా గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ సర్కారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది" - ది గార్డియన్
"కశ్మీర్ లోయలో ఇప్పటికే అలజడి నెలకొని ఉండగా, ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న దశలో ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దుతో అశాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి" -బీబీసీ
"కశ్మీరీలకు ఇది నిజంగా సైకలాజికల్ షాక్. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చాలా తీవ్రమైనది"
-సీఎన్ఎన్
"భారత ప్రభుత్వ నిర్ణయం సరికొత్త ఘర్షణలకు, వివాదాలకు తెరలేపింది. భారత్ లో కశ్మీర్ చేరికకు మూలం ఆర్టికల్ 370. ఇప్పుడా ఆర్టికల్ ను రద్దు చేయడం కశ్మీర్ తో భారత్ సంబంధాలను మరింత దెబ్బతీస్తుంది" - వాషింగ్టన్ పోస్ట్
"కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తప్పు. దీనిపై భారత రాష్ట్రపతి ఎంతో హడావుడిగా గెజిట్ విడుదల చేశారు. ఇకమీదట కశ్మీర్ ముస్లిం ప్రాబల్య ప్రాంతం నుంచి హిందూ ఆధిక్య ప్రాంతంగా మారిపోతుందని కశ్మీర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు"
- డాన్