Jammu And Kashmir: ఈ రోజు కశ్మీర్ ను తీసుకున్నాం.. రేపు బలోచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లను లాక్కుంటాం!: శివసేన నేత సంజయ్ రౌత్
- కేంద్రం నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం
- మోదీ అఖండ భారత్ అనే కలను నిజం చేయబోతున్నారు
- ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకే లాభం చేకూరుతుంది
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం ఈ రోజు రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ స్వాగతించింది. ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా కేంద్రం ఓ భస్మాసురుడిని అంతం చేసిందనీ, దేశాన్ని పట్టిపీడుస్తున్న పీడ విరగడ అయిపోయిందని శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. రాజ్యసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..‘ఈ రోజున జమ్మూకశ్మీర్ ను తీసుకున్నాం. రేపు బలోచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లను స్వాధీనం చేసుకుంటాం.
ప్రధాని నరేంద్ర మోదీ అఖండ భారత్ అన్న కలను నిజం చేస్తారన్న నమ్మకం నాకుంది. జమ్మూకశ్మీర్ రాజకీయ నేతలు ఆర్టికల్ 35A కారణంగా చాలా ఎంజాయ్ చేశారు. ఇకపై అలా కుదరదు. తాజా నిర్ణయం కారణంగా కశ్మీర్ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపాలి’ అని రౌత్ సూచించారు.