Jammu And Kashmir: మనమంతా సిగ్గుపడాల్సిన రోజు ఇది!: ఎండీఎంకే నేత వైగో

  • కేంద్రం నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం
  • దీనివల్ల కశ్మీర్ దక్షిణ సూడాన్, తూర్పు తైమూర్ లా మారిపోతుంది
  • రాజ్యసభలో కేంద్రాన్ని హెచ్చరించిన తమిళ పార్టీ నేత

జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వైగో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్ మరో కొసావో, తూర్పు తైమూర్, దక్షిణ సుడాన్ గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా చెడామడా తిట్టేశారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుంట నక్క లాంటి వ్యక్తి. అతను ఇప్పుడు కశ్మీర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

ఇతను మాత్రమే కాదు.. పక్కనే పాకిస్థాన్, చైనాలు కూడా కాచుకుని కూర్చున్నాయి. జమ్మూకశ్మీర్ ను మీరు తీవ్రమైన రాజకీయ అనిశ్చితికి కేంద్రంగా మార్చేస్తున్నారు. ఈ చర్యను మేం ఎంతమాత్రం సమర్థించబోం. మీరు పీడీపీ సభ్యులను సభ బయటకు నెట్టేశారు. సరే.. ఇప్పుడు కశ్మీరీ యువతను ఎలా నెట్టివేయగలరు? ఇది ప్రజాస్వామ్యం హత్యకు గురైన చీకటి రోజు. మనమంతా సిగ్గుపడాల్సిన రోజు’ అని ఘాటుగా విమర్శించారు. కశ్మీర్ సమస్యకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధమని ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో వైగో ఈ మేరకు స్పందించారు.

Jammu And Kashmir
Article 370 ABOLATION
Donald Trump
USA
mdmk
viko
warning
wolf
Pakistan
China
  • Loading...

More Telugu News