Jammu And Kashmir: ఆర్టికల్ 370 రద్దు.. మోదీకి జైకొట్టిన బద్దశత్రువు కేజ్రీవాల్!
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం
- దీనివల్ల జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుంది
- ట్విట్టర్ లో స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.
‘జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేం సమర్థిస్తున్నాం. దీనివల్ల జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి పరుగులు తీస్తుందనీ, శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాం’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ సహా ప్రధాని మోదీ తీసుకున్న పలు నిర్ణయాలను తీవ్రంగా విమర్శించిన కేజ్రీవాల్ కశ్మీర్ విషయంలో బేషరతుగా మద్దతు తెలపడం గమనార్హం.