Panjab: వేధింపులు వద్దన్నందుకు పంజాబ్ సీఎం కమాండో దారుణహత్య!
- క్లబ్ లో యువతిని వేధించిన యువకుడు
- వద్దని చెప్పిన కమాండోను కాల్చేసిన నిందితుడు
- అమరీందర్ సింగ్ వద్ద కమాండోగా ఉన్న సుఖ్వీందర్
ఓ యువతిని వేధిస్తున్న వ్యక్తిని హెచ్చరించినందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సెక్యూరిటీ వింగ్ లో ఉన్న కమాండర్ ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మొహాలీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పంజాబ్ పోలీస్ 4వ కమాండో బెటాలియన్ లో సుఖ్వీందర్ కుమార్ పనిచేస్తూ, అమరీందర్ భద్రతాదళంలో ఉన్నారు.
మొహాలీలోని ఓ క్లబ్ కు అతను వెళ్లిన సమయంలో చరణ్ జిత్ సింగ్ అనే యువకుడు, మరో యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని సుఖ్వీందర్ వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో క్లబ్ నిర్వాహకులు తొలుత చరణ్ జిత్ సింగ్ ను బయటకు పంపారు. ఆపై కాసేపటికి సుఖ్వీందర్ కూడా వెలుపలికి రావడంతో, అప్పటికే గన్ తో ఉన్న నిందితుడు, ఘర్షణకు దిగి, కాల్పులు జరిపి పరారయ్యాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుఖ్వీందర్ కన్నుమూయగా, నిందితుడిని గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని మొహాలీ ఎస్‌ఎస్పీ కుల్దీప్ సింగ్ తెలిపారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.