Nalgonda District: ఆసుపత్రికని చెప్పి తీసుకువెళ్లి అడ్డు తొలగించుకున్నాడు? : వివాహిత అనుమానాస్పద మృతి
- భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
- వైద్య పరీక్షల అనంతరం కనిపించడం లేదని ఫోన్
- అటవీ ప్రాంతంలో శవమై కనిపించిన బాధితురాలు
వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి భర్తతో కలిసి వెళ్లిన మహిళ శవమై కనిపించడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా దంపతుల మధ్య విభేదాలుండడంతో భర్తే హత్యచేశాడని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు...నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపూర్‌కు చెందిన సరిత (22)కు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ రాజుతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు పెళ్లయిన కొన్నాళ్లు బాగున్నా ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యను వేధిస్తుండడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు విషయం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా రాజు తీరు మారలేదు.
ప్రస్తుతం సరిత గర్భిణి. ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం రాజు శనివారం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కొన్ని గంటల తర్వాత సరిత సోదరికి ఫోన్ చేసిన రాజు తన భార్య కనిపించడం లేదంటూ చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గేట్ సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు క్లూస్ టీంతో రంగంలోకి దిగి బంధువులను రప్పించగా అది సరిత మృతదేహమేనని వారు తెలిపారు. భర్తే ఆమెను హత్యచేశాడని ఆరోపిస్తూ ఠానా ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన రాజు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.