Jammu And Kashmir: కశ్మీర్ లో టెన్షన్.. టెన్షన్.. ఈరోజు ఉదయం 11 గంటలకు హోంమంత్రి షా కీలక ప్రకటన!
- పార్లమెంటులో మాట్లాడనున్న అమిత్ షా
- మోదీ నివాసంలో ముగిసిన కేబినెట్ భేటీ
- జమ్మూకశ్మీర్ అంతటా 144 సెక్షన్ అమలు
జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించేలా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. అనుకున్నట్లుగానే ఈరోజు ఉదయం సమావేశమైన కేబినెట్.. కశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రసంగిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
మరోవైపు జమ్మూకశ్మీర్ లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను పోలీసులు నిన్న అర్ధరాత్రి గృహనిర్బంధంలో ఉంచారు. దీంతో కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు, స్వయంప్రతిపత్తికి సంబంధించి ఆర్టికల్ 370, 35A లను ఎత్తేస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కేబినెట్ భేటీ ముగియడంతో మంత్రులంతా పార్లమెంటుకు బయలుదేరారు.