ddca: ఎంపీ అయినా తెలివిలేదు.. గంభీర్‌పై బిషన్ సింగ్ బేడీ మండిపాటు
- బేడీ, చౌహాన్‌లపై తీవ్ర విమర్శలు చేసిన గంభీర్
- ఖండించిన బిషన్ సింగ్ బేడీ
- డీడీసీఏలో తనకు ఎటువంటి పదవీ లేదని వివరణ
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తనపై చేసిన ఆరోపణలపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ స్పందించాడు. ‘‘గంభీర్ ఎంపీ అయినా హుందాతనం మాత్రం లేదు. నవ్‌దీప్ సైనీకి వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు. రంజీ జట్టులోకి రాకుండా నేను అడ్డుకోలేదు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో నాకు ఎటువంటి పదవీ లేనప్పుడు నేనెలా అడ్డుకోగలను?’’ అని ప్రశ్నించాడు. తనకు తెలిసి ఇంకెవరో ఆ పని చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పాడు.
విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన యువ పేసర్ నవ్‌దీప్ సైనీ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించాడు. సైనీ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించిన గంభీర్.. చేతన్ చౌహాన్, బిషన్ సింగ్ బేడీపై తీవ్ర విమర్శలు చేశాడు. అప్పట్లో ఢిల్లీ రంజీ జట్టులోకి ఇతనిని తీసుకోవడానికి వీరిద్దరూ అభ్యంతరం చెప్పారని, ఇప్పుడు సైనీ దెబ్బకు వీరి మిడ్ వికెట్లు ఎగిరిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.