Sivasena: మోదీ... ఇదే సరైన సమయం... ముందుకు దూకేయండి: శివసేన
- దశాబ్దాల అశాంతికి చెక్ పెట్టే సమయం
- మోదీ, షాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి
- అనుకూల వాతావరణం ఉందన్న 'సామ్నా'
భారతీయ జనతా పార్టీ నేడు ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు పూర్తి మద్దతిస్తామని శివసేన వెల్లడించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న అశాంతికి మోదీ సర్కారు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుందనే భావిస్తున్నామని, ఆ దిశగా ప్రభుత్వం ముందడుగే వేయాలని సూచించింది.
జమ్మూ కశ్మీర్ లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వెన్నంటి నిలుస్తామని పేర్కొంది. అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి వచ్చిన యాత్రికులను, యాత్ర ముగియకుండానే మధ్యలో వెనక్కు వచ్చేయాలనే పరిస్థితి మరోమారు ఏర్పడకుండా చూడాలని సూచించింది. కశ్మీర్ లో పరిస్థితిని తెలుసుకునేందుకు అమిత్ షా అక్కడ పర్యటించి రావడంపై పొగడ్తలు కురిపించింది.
ఇప్పటివరకూ ప్రధాని తాను తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని రహస్యంగా ఉంచారని, దాన్ని తెలుసుకోవాలని దేశమంతా ఎదురుచూస్తోందని 'సామ్నా' సంపాదకీయం పేర్కొంది. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేందుకు ఇదే సరైన సమయమని, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడింది. కశ్మీర్ సమస్యను మోదీ సర్కారు పరిష్కరించగలిగితే, అది అద్భుతమే అవుతుందని, చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొంది.