Godavari: గోదావరిలో 540 టీఎంసీల నీరు సముద్రం పాలు!
- గోదావరిపై ఇంకా పూర్తికాని ప్రాజెక్టులు
- భారీ వర్షాలతో పొంగుతున్న గోదావరి
- ధవళేశ్వరం వద్ద 13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- పోలవరం స్పిల్ వేపై 26 అడుగుల నీరు
వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులు కడుతున్నా అవి ఇంకా పూర్తి కాకపోవడంతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు, తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలు కూడా తోడు కావడంతో గోదావరి నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటివరకూ గోదావరికి చిట్టచివరిగా ఉన్న ఆనకట్ట ధవళేశ్వరం నుంచి 540 టీఎంసీల నీరు బంగాళాఖాతంలోకి వెళ్లిపోయింది.
నదిలో భారీగా వరద కొనసాగుతూ ఉండటంతో ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దేవీపట్నం మండలంలోని గ్రామాలు, కోనసీమ లంక పొలాలు నీట మునగగా, వందలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 39 గ్రామాలు నీట మునిగాయి.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న స్పిల్ వేపై 26 అడుగుల మేరకు నీరు చేరింది. నేడు లేదా రేపు కొంతమేరకు వరద తగ్గుతుందని అంచనా వేస్తున్నా, తూర్పు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు గోదావరికి వరదను మరింత పెంచుతాయనే భావిస్తున్నారు.
ఇదిలావుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎటపాక, కూనవరం, దేవీపట్నం, వీఆర్ పురం, కాట్రేనికోన, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 8377 మందిని తరలించారు. తూర్పు గోదావరి జిల్లాలో 167 గ్రామాలు నీటి ముంపులో ఉన్నాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి 40 మంది, ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి 52 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని అధికారులు వెల్లడించారు.