QRSAM: మరో అత్యాధునిక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
- చాందీపూర్ రేంజ్ నుంచి క్యూఆర్ శామ్ క్షిపణి ప్రయోగం
- విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిన మిస్సైల్
- ఆర్మీ కోసం ఈ క్షిపణిని రూపొందించిన డీఆర్ డీఓ
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే క్యూఆర్ శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించిన ఈ అత్యాధునిక క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించింది. ఆర్మీ కోసం ఈ మిస్సైల్ ను డీఆర్ డీఓ రూపొందించింది. ఇది భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల క్షిపణి. ఇది అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ, ఎక్కడినుంచైనా ప్రయోగించే వీలుంది.
దీంట్లో ఎలక్ట్రానిక్ ప్రతిదాడుల వ్యవస్థను పొందుపరిచారు. యుద్ధ విమానాల రాడార్లు జామర్లతో దీన్ని నిలువరించే ప్రయత్నం చేసినా, కౌంటర్ మెజర్ వ్యవస్థ ద్వారా సులువుగా తప్పించుకోగలదు. 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్యూఆర్ శామ్ మిస్సైల్ లో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు.
2017 జూన్ 4న తొలిసారి ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రెండు రౌండ్ల పాటు మరోసారి పరీక్షించగా, రెండు పర్యాయాలు విజయవంతంగా లక్ష్యాన్ని తాకింది. తాజాగా, మరోసారి సక్సెస్ కావడంతో రక్షణ రంగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.