Navdeep Saini: ఎలా ఉంది సైనీ దెబ్బ? మీ మిడిల్ స్టంప్ లు ఎగిరిపోయాయా?: బేడీ, చౌహాన్ లపై గంభీర్ ఫైర్
- సైనీ రంజీ ఎంపికకు అడ్డు చెప్పిన బేడీ, చౌహాన్!
- విండీస్ తో మ్యాచ్ లో 3 వికెట్లతో రాణించిన సైనీ
- బేడీ, చౌహాన్ లను ఎద్దేవా చేసిన గంభీర్
టీమిండియా యువ సంచలనం నవదీప్ సైనీ వెస్టిండీస్ తో టి20 మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చడం పట్ల మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో సైనీ 3 వికెట్లతో విండీస్ వెన్నువిరిచాడు. దీనిపై గంభీర్ మాట్లాడుతూ, గతంలో సైనీని ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకోవాలని తాను సూచించినప్పుడు బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్ తీవ్ర అభ్యంతరం చెప్పారని, కనీసం అతడ్ని పరీక్షించకముందే కెరీర్ కు చరమగీతం పాడేలా ప్రవర్తించారని మండిపడ్డాడు.
ఇప్పుడు సైనీ అంతర్జాతీయ కెరీర్ తొలి మ్యాచ్ లోనే తిరుగులేని ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడని, ముఖ్యంగా, సైనీ బౌలింగ్ కు బేడీ, చౌహాన్ ల మిడిల్ స్టంప్స్ ఎగిరిపోయాయని ఎద్దేవా చేశాడు. గల్లీ క్రికెట్ ఆడుకుంటున్న సైనీని మొదటగా గుర్తించింది గంభీర్. సైనీ పేస్ లో ఉన్న పదునును పసిగట్టిన గంభీర్ వెంటనే ఢిల్లీ రంజీ టీమ్ కు ఎంపిక చేసేందుకు తహతహలాడాడు.
అయితే, ఢిల్లీ క్రికెట్ సంఘంలో ఓ వర్గమైన బేడీ, చౌహాన్ లు అందుకు అంగీకరించలేదని సమాచారం. సైనీలో పెద్దగా పసలేదని వ్యాఖ్యానించగా, గంభీర్ పట్టుబట్టి మరీ సైనీని రంజీ టీమ్ లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత సైనీకి తిరుగులేకుండా పోయింది. వాయువేగంతో బంతులేసే బౌలర్ గా కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ పోటీల్లో తన ప్రదర్శనతో టీమిండియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు.