Agri gold: అగ్రిగోల్డ్ ఆస్తులను బినామీ పేర్లతో అమ్ముకుంటున్నారు: ముప్పాళ్ల నాగేశ్వరరావు
- ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి
- రియల్ ఎస్టేట్ వెంచర్లుగా చేసి ప్రభుత్వమే విక్రయించాలి
- ఇచ్చిన మాట మేరకు బాధితులకు పరిహారం ఇవ్వాలి
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని, నిధులు విడుదల చేస్తామని సీఎం జగన్ చెప్పి రెండు నెలలు గడుస్తున్నా ఫలితం లేదని ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. తిరుపతిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు అయిన ఆయన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పదమూడు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్ల నష్టపరిహారం ఇస్తామని కేబినెట్ తీర్మానం చేసిందని, బడ్జెట్ లో కేటాయింపులు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ నిధులు విడుదల కాలేదని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను బినామీ పేర్లతో అమ్ముకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం సత్వరం స్పందించాలని కోరారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ప్రభుత్వమే విక్రయించాలని, ఇచ్చిన మాట మేరకు బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.