Karnataka: యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదు.. 224 చోట్లా ఎన్నికలు జరుగుతాయి!: జేడీఎస్ నేత కుమారస్వామి
- త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయి
- జేడీఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి
- మాండ్యలో జేడీఎస్ కార్యకర్తలతో భేటీ
కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇటీవల అనర్హతవేటుకు గురైన 17 నియోజకవర్గాల్లో త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయనీ, కాబట్టి జేడీఎస్ కార్యకర్తలంతా అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన జేడీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగవచ్చని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఇటీవల కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో 99-105 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, యడియూరప్ప కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూలిపోయేందుకు కారణమైన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ 2023 వరకూ ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు విధించారు.