Andhra Pradesh: సెప్టెంబర్ 1 నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తాం: కొడాలి నాని
- తొలి విడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తాం
- బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా సరఫరా చేస్తాం
- ప్యాక్ చేసిన బియ్యం ఇవ్వబోతున్నాం
సెప్టెంబర్ 1 నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపీణీ చేసే పథకాన్ని తొలి విడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రం మొత్తం సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. అవినీతికి, రీసైక్లింగ్ కు తావు లేకుండా చేసేందుకే ప్యాక్ చేసిన బియ్యం ఇవ్వబోతున్నామని అన్నారు.
ప్యాకింగ్ కు రూ.250 కోట్లు ఖర్చు పెడుతున్నామని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, రూ.12 వేల కోట్ల విలువ చేసే బియ్యం పంపిణీ చేసినప్పుడు ప్యాకింగ్ నిమిత్తం ఇంత డబ్బు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి ప్రస్తావిస్తూ, అక్టోబర్ 2 నుంచి చేపడతామని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.