Telangana: తెలంగాణలో ఇస్మార్ట్ దొంగలు.. ఇంట్లో సొత్తుతో పాటు కారు, సీసీటీవీ హార్డ్ డ్రైవ్ లు ఎత్తుకెళ్లిన వైనం!
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘటన
- ఫైనాన్స్ వ్యాపారి పి.శ్రీనివాసరావు ఇంటిపై రెక్కీ
- రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల లూటీ
ఇటీవలికాలంలో దొంగలు తెలివి మీరిపోతున్నారు. వస్తువులను దొంగలించడమే కాదు.. వాటికి సాక్ష్యాలు కూడా లేకుండా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని డాబాల బజారువీధికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి పాలవలస శ్రీనివాసరావు తన కుటుంబంతో కలిసి 3 రోజుల క్రితం తిరుపతికి వెళ్లాడు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఇంటిపై రెక్కీ నిర్వహించిన దొంగలు రాత్రికిరాత్రి పని కానిచ్చేశారు. ఇంట్లో దాచిపెట్టిన రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, మరికొంత నగదును తస్కరించారు.
అంతటితో ఆగకుండా దొంగలించిన సొత్తును తీసుకెళ్లడానికి శ్రీనివాసరావు కారును వాడుకున్నారు. అంతేకాదు.. తమ గుర్తింపు తెలియకుండా ఉండేందుకు ఇంట్లోని సీసీటీవీ కెమెరాల డేటా నిక్షిప్తమయ్యే హార్డ్ డ్రైవ్ లను కూడా పట్టుకెళ్లారు. మూడ్రోజుల అనంతరం ఇంటికొచ్చిన శ్రీనివాసరావు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మూడో పట్టణ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.