chennai: లోదుస్తుల్లో సంచి.. అందులో మిరుమిట్లు గొలిపే వజ్రాలు.. చెన్నై విమానాశ్రయంలో పట్టుబడిన ప్రయాణికుడు
- మలేషియా నుంచి వచ్చిన అజ్మల్ ఖాన్
- 2996 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
- వాటి విలువ రూ. 2.25 కోట్లుగా అంచనా
మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు చెన్నై విమానాశ్రయంలో రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలతో దొరికిపోయాడు. మలేషియా నుంచి వచ్చిన అజ్మల్ ఖాన్ నాగూర్ మీరా (48) అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి వస్తువులు కనిపించకపోవడంతో బాడీ స్కాన్ చేశారు.
బాడీ స్కాన్‌లో అజ్మల్ లోదుస్తుల్లో ఓ సంచిని అధికారులు గుర్తించారు. దానిని విప్పి చూసిన అధికారులు విస్తుపోయారు. అందులోని వజ్రాలను చూసి ఆశ్చర్యపోయారు. వాటి విలువ రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అలాగే, అతడు తీసుకొచ్చిన కుక్కర్‌ను పరిశీలించగా అందులోనూ వజ్రాలు కనిపించాయి. కుక్కర్ అంతర్భాగంలో ఓ సంచిలో దాచిపెట్టిన వజ్రాలు బయటపడ్డాయి.
అజ్మల్ నుంచి మొత్తం రూ. 2.25 కోట్ల విలువైన 2996 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటిని ఎవరి కోసం తీసుకొచ్చాడన్న దానిపై కూపీ లాగుతున్నారు. కాగా, అజ్మల్ కోసం ఎవరైనా వస్తారేమోనని పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. అతడిని విమానాశ్రయం బయట నిల్చోబెట్టి వజ్రాల కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూశారు. చాలాసేపు ఎదురుచూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో అజ్మల్‌ను వెనక్కి తీసుకెళ్లారు.