India: పాకిస్థాన్ బుద్ధి ఎలాంటిదో చెప్పిన రాజ్ నాథ్ సింగ్
- పాక్ తన క్షిపణులకు బాబర్, గజినీ, ఘోరీ వంటి పేర్లు పెట్టిందన్న రాజ్ నాథ్
- భారత్ అగ్ని, పృథ్వి, ఆకాశ్ అంటూ పంచభూతాల పేర్లు పెట్టిందని వివరణ
- పాక్ ది ఉగ్రస్వభావం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ వ్యాఖ్యలు
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై మరోసారి నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ ది దుష్ట స్వభావమని అన్నారు. పాక్ తన క్షిపణులకు బాబర్, గజినీ, ఘోరీ వంటి చొరబాటుదారుల పేర్లు పెట్టిందని, కానీ భారత్ మాత్రం అగ్ని, పృథ్వి, ఆకాశ్ అంటూ పంచభూతాల పేర్లు పెట్టిందని వివరించారు. పాకిస్థాన్ ఉగ్రస్వభావం గురించి చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని అన్నారు. భారత్ శాంతినే కోరుకుంటుందని చెప్పడానికి మన క్షిపణుల పేర్లే నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్ ను తూర్పారబట్టారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని విస్పష్టంగా ప్రకటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు.