Jagan: 'జగన్ ఒక్కడు కాదు ఇద్దరు' అంటూ నారా లోకేశ్ సెటైర్!
- 45 ఏళ్లకే పింఛనుపై జగన్ మాట తప్పారంటున్న లోకేశ్
- పాదయాత్రలో హామీ ఇచ్చింది ఎవరంటూ లోకేశ్ ప్రశ్నాస్త్రం
- మరోసారి ట్విట్టర్ లో నిలదీసిన టీడీపీ యువనేత
అసెంబ్లీ సాక్షిగా మాట మార్చాం, మడమ తిప్పాం అంటూ సీఎం జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ గారు పాదయాత్ర చేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెళ్లు మోకాళ్ల నొప్పులతో పనులు చేసుకోలేక బాధపడుతున్నారంటూ 45 ఏళ్లకే రెండు వేల రూపాయల పింఛను ఇస్తానని హామీ ఇవ్వగా, వైసీపీ నేతలు ఆయన కంటే రెండాకులు ఎక్కువే చదివి ఆ పింఛను మూడు వేలు అని ప్రచారం చేసుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.
అయితే, ఇప్పుడా హామీని తుంగలో తొక్కారంటూ లోకేశ్ మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ బయటపెడితే కానీ ఆ నాటకం అందరికీ తెలియలేదని, తాను ఎప్పుడూ అలాంటి హామీలు ఇవ్వలేదని జగన్ ఏవేవో వీడియోలు చూపించారని, తమ వద్ద ఉన్న వీడియోలు చూపిస్తామంటే మాత్రం టీడీపీకి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. డ్యూయెల్ రోల్ సినిమా తరహాలో "ఆ హామీ ఇచ్చింది నేను కాదు, అచ్చు నాలాగే ఉండే నా తమ్ముడు యూ-టర్న్ జగన్" అన్నట్టుగా పరిస్థితి తయారైందని సెటైర్ వేశారు.
జగన్ గారు తాను 45 ఏళ్లకే పింఛను హామీ ఇవ్వలేదంటున్నారని, మరి పాదయాత్రలో హామీ ఇచ్చింది, ఇంటర్వ్యూల్లో చెప్పింది ఎవరు? అంటూ లోకేశ్ నిలదీశారు. వీటినే జగన్నాటకాలు అంటారని ఎద్దేవా చేశారు.