Jammu And Kashmir: ‘శ్రీనగర్ నిట్’ కాలేజీని ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశం.. కేటీఆర్ కు సమాచారం ఇచ్చిన తెలుగు విద్యార్థులు!
- అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న తెలంగాణ నేత
- అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని వ్యాఖ్య
- తల్లిదండ్రులు రెసిడెంట్ కమిషనర్ ను సంప్రదించాలని సూచన
జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 35,000 మందికి పైగా అదనపు బలగాల మోహరింపుతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ పౌరులకు ప్రత్యేక అధికారాలు కల్పించే(నిర్వచించే) ఆర్టికల్ 35 A ను ఎత్తివేస్తారని ఈ సందర్భంగా ప్రచారం సాగుతోంది. దీంతో అమర్ నాథ్ యాత్రికులతో పాటు రాష్ట్రంలోని శ్రీనగర్ నిట్ లో చదువుకుంటున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను జిల్లా యంత్రాంగం బలవంతంగా పంపించివేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు.
‘శ్రీనగర్ నిట్ క్యాంపస్ ను తక్షణం ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అక్కడి తెలుగు విద్యార్థులు నాకు సందేశాలు పంపుతున్నారు. మీరంతా జాగ్రత్తగా రాష్ట్రానికి తిరిగివచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మీ అందరికీ సాయం చేసేందుకు సిద్ధం కావాలని అధికారులకు ఇప్పటికే సమాచారం అందించాం’ అని తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. అక్కడ చదువుతున్న తమ పిల్లల గురించి తెలుసుకునేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి గారిని పోన్ నంబర్ 011-2338 2041 లేదా +91 99682 99337 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.