Godavari: గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో 400 గ్రామాలు

  • వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు కూడా ఉద్ధృతం
  • ఉభయ గోదావరి జిల్లాల్లో నీటమునిగిన గ్రామాలు
  • ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేత

గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవాహం స్థాయి ఉద్ధృతంగా ఉంది. అంతకంతకూ పెరుగుతున్న వరదతో పరీవాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, తొయ్యేరు, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 

వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దేవీపట్నం, తొయ్యేరు రహదారిపై 4 అడుగుల మేర ప్రవాహం పారుతోంది. లంక గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

పి.గన్నవరం మండలం చాలకలిపాలెం సమీపంలో కాజ్‌వే నీట మునిగింది. నాలుగు రోజులుగా కరకాయ లంక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బూరుగులంక, హరిగెలవారిపేట, జి.పెదపూడి లంక, అయోధ్యలంక, అనగారిలంక వాసులు మరబోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారి విగ్రహం వద్ద రెండు అడుగుల మేర వరద నీరు నిలిచింది. చాలా ప్రాంతాల్లో అరటి తోటలు నీట మునిగాయి.

ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.34 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా. 9.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్ట వద్ద ప్రస్తుతం 11.2 అడుగుల మేర నీటిమట్టం ఉండటంతో సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశముంది.

ఇక పశ్చిమగోదావరి జిల్లాలోనూ గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మునిగిపోయింది. స్పిల్‌వే మీదుగా రెండు మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. కాఫర్‌ డ్యాం వద్ద వరద ప్రవాహం 28 మీటర్లకు చేరింది. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు వారం క్రితమే రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగుకు వరద చేరడంతో 14 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.

Godavari
east west godavari districts
400 villages in flood
  • Loading...

More Telugu News