Maharashtra: చట్టం చేసినా డోన్ట్ కేర్.. భార్యకు ఫోన్ లో ‘ట్రిపుల్ తలాక్’ చెప్పిన ప్రబుద్ధుడు!

  • వాట్సాప్ లోనూ సందేశం పంపిన వైనం
  • మహారాష్ట్రలోని థానేలో ఘటన
  • ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు నమోదు

కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినా, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ట్రిపుల్ తలాక్ కేసులు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఓ ట్రిపుల్ తలాక్ కేసు నమోదయింది. థానేకు చెందిన ఓ మహిళ, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే భార్య ఏడు నెలల గర్భవతిగా ఉండగానే భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం నెరపడం ప్రారంభించాడు.

కుటుంబ పోషణను కూడా పట్టించుకోని సదరు ప్రబుద్ధుడు భార్యకు ఇటీవల ఫోన్ చేసి ‘తలాక్.. తలాక్.. తలాక్’ అని మూడుసార్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. వాట్సాప్ లోనూ ఈ సందేశాన్ని పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ ను శిక్షార్హమైన నేరంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికింద ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష పడనుంది.

  • Loading...

More Telugu News